"ఆత్రేయ పాటల్లో లోతైన భావాలు,జీవిత సత్యాలు,ఎంతో మేధస్సు ఇమిడి వున్నాయి. ప్రజల ఆలోచనలు,ఊహాగానాలు ఆయన పాటల్లో వుట్టిపడుతుంటాయి. మనిషి జీవిత అనుభవాలు,చీకటి,వెలుతురు,అపజయాల గురించి ఆయన హృదయాలకు హత్తుకునే విధంగా పాటలు రాశారు" ~ కీ.శే.ఎన్.టి.రామారావు     "మానవ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, గెలుపు ఓటములను అనుభవాలను ప్రతిబింబిస్తూ మనసుల్ని కదిలించే విధంగా ఆయన రాసిన పెక్కు పాటలు చిరస్మరణీయాలై నిలిచాయి" ~ ఎన్.టి.రామారావు     "ఆత్రేయ వ్రాసిన పాటలన్నీ ప్రజల మనోభావాలను పుణికిపుచ్చుకుని ఉండేవి" ~ఎన్.టి.రామారావు     "ఆత్రేయ అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగ కర్త, ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట,పాటల ముత్యాలపేట" ~ డా.సి.నా.రె.     "బరువైన భావాల కొండలను చిటికెను వేలుపై గోవర్ధన గిరివలె సునాయాసంగా తేలిక మాటల్లో వహించడం,వచించడం గీతాచార్యుడికే(ఆత్రేయ)తెలుసు" ~వేటూరి సుందరరామ మూర్తి     "భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను తిమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడం ఆచార్యుడు(ఆత్రేయ)తిక్కనకు వారసుడు" ~వేటూరి సుందరరామ మూర్తి     "సినీ సాహితీ రంగంలో అపర శ్రీనాథుడు. తెలుగు సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించినవాడు" ~గొల్లపూడి మారుతీరావు     "శృంగారమైనా,మమకారమైనా తేలిక పదాలతో చదువుకున్న వాణ్ణి ,చదువులేని వాణ్ని గుండె లోతులవరకూ కదిలించగల ప్రతిభ ఆత్రేయది" ~ గొల్లపూడి మారుతీరావు     " తెలుగు సినిమాకు ఒక గొప్ప రూపాన్ని కల్పించిన రచయిత. తనదైన బాణీని ఇచ్చిన రచయిత ఆత్రేయగారు" ~గొల్లపూడి మారుతీరావు     "ఆత్రేయ వ్రాసిన పాటల్లో ప్రతి పల్లవి తీసుకొని ఒక కథ వ్రాయవచ్చు. అంత గంభీరమైన,భావస్పోరకమైన భాష ఆత్రేయది" ~కె.ఎస్.ప్రకాశరావు     " తెలుగు భాష తెలిసిన నటీనటులకు ఆత్రేయ సంభాషణలు పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన విస్తరి." ~ గుమ్మడి వెంకటేశ్వరరావు      "శ్రీ ఆత్రేయ వ్యక్తిగా చాలా నిరాడంబరుడు. ఆయన విలువ ఆయనకే తెలియని ఒక సామాన్యుడు. కత్తితో కోస్తే రక్తం వస్తే, ఆయన కలంతో రాస్తే రక్తం ఉడుకెక్కుతుంది. మనసు ఉరకలేస్తుంది.రాసినవాడికి కాదు, ఆయన రాసింది చదువుకునే వాడికి! ~ శ్రీ కె.విశ్వనాథ్     " శ్రీ ఆత్రేయ గారు స్వయంగా నటుడు, ప్రయోక్త,రచయిత కాబట్టి ప్రతి డైలాగు రాసిన తర్వాత నటుడిగా నటించుకొని, ప్రయోక్తగా ఎంతవరకూ కావాలో కుదించుకొని, అక్షరలక్షలుగా వ్రాయటం, ఆయనలోని ప్రత్యేకత." ~ మురళీమోహన్     " ఎక్కడ ఇపోతాయో...అన్నంత పొదుపుగా తన సంభాషణా రచనలో మాటల్ని వాడుకున్నవాడు ఆత్రేయ" ~తనికెళ్ళ భరణి     "తెలుగు సినిమా పాటకో మనసుని, ఉన్నతమైన భావాన్ని ఇచ్చిన ఘనత ఆత్రేయకు దక్కుతుంది." ~కె.రామలక్ష్మి ఆరుద్ర     "మామూలు మాటలతో పాటలని పొదగ వచ్చు అనే విషయాన్ని మొట్ట మొదటిగా ప్రదర్శించి చెప్పింది, ఆచరించి చూపింది ఆచార్య ఆత్రేయ" ~కొంగర జగ్గయ్య     "వేమన తరువాత ఆత్రేయ పుట్టాడు. అంత తేట తెలుగుదనం ఉంది ఆయన రచనలో" ~ హీరో కృష్ణంరాజు     "ఆత్రేయగారి డైలాగ్స్ కి ట్యూన్ కడితే పాట,ఆయన పాటని ట్యూన్ లేకుండా చదివితే డైలాగ్" ~సత్యానంద్     "సినీ సంభాషణా శైలిని పరిశీలిస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్లుగా "ఆత్రేయ పూర్వం-ఆత్రేయ తర్వాత" అని ఖచ్చితంగా అనవచ్చు." ~తోటపల్లి మధు.      "బరువైన తేలిక పదాలతో మనసుకు,మనిషికి కొత్త భాష్యాన్ని చెప్పినవారు ఆత్రేయ" ~డా.పర్వతనేని సుబ్బారావు     "తెలుగు సినీ జగత్తుని తన పాటల మాటల వెన్నెల జల్లుతో నిరంతరం పరవశింప జేస్తున్న నెలరేడు ఆత్రేయుడు" ~డా.తలతోటి పృథ్వి రాజ్

Friday, November 5, 2010

Athreya Letters - ఆత్రేయ ఉత్తరాలు

Interview with smt.Padmavathi Athreya about controversial letter

ఆత్రేయ గారి రచనల్లోకెల్లా విశిష్టమైన రచన పద్యాలతో కూడిన వారి "ఆత్మ కథ". ఈ ఆత్మకథ రచనా ప్రయత్నం ఆత్రేయ వ్యక్తిత్వాన్నిచాటింది.ఆత్రేయ తన ఆత్మ కథను పద్యకావ్యంగా రచించారు. పీటిక,అంకితము,యోగ్యతా పత్రము,అమ్మ,పుట్టినిల్లు,పగ-బలి,భ్రాంతి,క్షమ,విద్యా బుద్ధులు,తొలి గాయం శీర్షికలతో రాసిన పద్యాలతో అసంపూర్ణ ఆత్మకథ తో ఆత్రేయ మన మధ్యనుండి దూరమయ్యాడు. వివాహానికి ముందు తాను ప్రేమించిన బాణం అనే అమ్మాయిని తలచుకొని ఆత్రేయ తన ఆత్మకథలో "తొలిగాయం"పేరుతో పద్యరచన చేస్తున్నాడని తెలుసుకున్న ఆత్రేయ గారి భార్య పద్మావతిగారు " తొలిగాయమని మీరు ఆత్మకథ రాస్తున్నారట! మీరు మరోమనిషికి చేసిన అన్యాయన్నికూడా మీ ఆత్మకథలో రాయండని"కోపంతో ఒక ఉత్తరాన్ని ఆత్రేయకు రాసి పోస్ట్ చేసారు. పోస్ట్ లో ఆ ఉత్తరాన్ని అందుకున్న ఆత్రేయ "ఆత్మకథ" లో రాయడ మేమిటి...కావాలంటే పేపర్లోనే వేయిస్తా"నని ఆత్రేయ ఆ ఉత్తరాన్ని ఆంధ్రజ్యోతి పత్రికవారికి తన మరణాంతరం దానిని ప్రచురించమని సీల్ చేసి ఇచ్చాడట. 1975 లోనో 1976 లోనో రాసిన ఆ ఉత్తరం ఆత్రేయ మరణాంతరం అంటే 1989 లో ఆంధ్రజ్యోతిలో ప్రచురింప బడింది. ఈ సంఘటనను బట్టి ఆత్రేయ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే మనస్తత్వమని గ్రహించవచ్చు. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లి చేసుకొని జీవితాన్ని దుఖంతో నింపు కున్నవాడు ఆత్రేయ. భర్తగా ఆత్రేయ భార్య అయిన పద్మావతి జీవితానికి న్యాయం చేయాలనుకునేవాడుగాని,తానున్న ఆ ఆకర్షణల వలయాలని చేదించుకొని రాలేక పోయాడు. ఐతే పశ్చాతాపంతో, ప్రేమతో భార్యకు అప్పుడప్పుడు ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉండేవాడు.
1 comment:

  1. athreya gaari letters inkemaina dorike avakasam vundaa...plz vunte cheppandi

    ReplyDelete