"ఆత్రేయ పాటల్లో లోతైన భావాలు,జీవిత సత్యాలు,ఎంతో మేధస్సు ఇమిడి వున్నాయి. ప్రజల ఆలోచనలు,ఊహాగానాలు ఆయన పాటల్లో వుట్టిపడుతుంటాయి. మనిషి జీవిత అనుభవాలు,చీకటి,వెలుతురు,అపజయాల గురించి ఆయన హృదయాలకు హత్తుకునే విధంగా పాటలు రాశారు" ~ కీ.శే.ఎన్.టి.రామారావు     "మానవ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, గెలుపు ఓటములను అనుభవాలను ప్రతిబింబిస్తూ మనసుల్ని కదిలించే విధంగా ఆయన రాసిన పెక్కు పాటలు చిరస్మరణీయాలై నిలిచాయి" ~ ఎన్.టి.రామారావు     "ఆత్రేయ వ్రాసిన పాటలన్నీ ప్రజల మనోభావాలను పుణికిపుచ్చుకుని ఉండేవి" ~ఎన్.టి.రామారావు     "ఆత్రేయ అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగ కర్త, ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట,పాటల ముత్యాలపేట" ~ డా.సి.నా.రె.     "బరువైన భావాల కొండలను చిటికెను వేలుపై గోవర్ధన గిరివలె సునాయాసంగా తేలిక మాటల్లో వహించడం,వచించడం గీతాచార్యుడికే(ఆత్రేయ)తెలుసు" ~వేటూరి సుందరరామ మూర్తి     "భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను తిమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడం ఆచార్యుడు(ఆత్రేయ)తిక్కనకు వారసుడు" ~వేటూరి సుందరరామ మూర్తి     "సినీ సాహితీ రంగంలో అపర శ్రీనాథుడు. తెలుగు సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించినవాడు" ~గొల్లపూడి మారుతీరావు     "శృంగారమైనా,మమకారమైనా తేలిక పదాలతో చదువుకున్న వాణ్ణి ,చదువులేని వాణ్ని గుండె లోతులవరకూ కదిలించగల ప్రతిభ ఆత్రేయది" ~ గొల్లపూడి మారుతీరావు     " తెలుగు సినిమాకు ఒక గొప్ప రూపాన్ని కల్పించిన రచయిత. తనదైన బాణీని ఇచ్చిన రచయిత ఆత్రేయగారు" ~గొల్లపూడి మారుతీరావు     "ఆత్రేయ వ్రాసిన పాటల్లో ప్రతి పల్లవి తీసుకొని ఒక కథ వ్రాయవచ్చు. అంత గంభీరమైన,భావస్పోరకమైన భాష ఆత్రేయది" ~కె.ఎస్.ప్రకాశరావు     " తెలుగు భాష తెలిసిన నటీనటులకు ఆత్రేయ సంభాషణలు పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన విస్తరి." ~ గుమ్మడి వెంకటేశ్వరరావు      "శ్రీ ఆత్రేయ వ్యక్తిగా చాలా నిరాడంబరుడు. ఆయన విలువ ఆయనకే తెలియని ఒక సామాన్యుడు. కత్తితో కోస్తే రక్తం వస్తే, ఆయన కలంతో రాస్తే రక్తం ఉడుకెక్కుతుంది. మనసు ఉరకలేస్తుంది.రాసినవాడికి కాదు, ఆయన రాసింది చదువుకునే వాడికి! ~ శ్రీ కె.విశ్వనాథ్     " శ్రీ ఆత్రేయ గారు స్వయంగా నటుడు, ప్రయోక్త,రచయిత కాబట్టి ప్రతి డైలాగు రాసిన తర్వాత నటుడిగా నటించుకొని, ప్రయోక్తగా ఎంతవరకూ కావాలో కుదించుకొని, అక్షరలక్షలుగా వ్రాయటం, ఆయనలోని ప్రత్యేకత." ~ మురళీమోహన్     " ఎక్కడ ఇపోతాయో...అన్నంత పొదుపుగా తన సంభాషణా రచనలో మాటల్ని వాడుకున్నవాడు ఆత్రేయ" ~తనికెళ్ళ భరణి     "తెలుగు సినిమా పాటకో మనసుని, ఉన్నతమైన భావాన్ని ఇచ్చిన ఘనత ఆత్రేయకు దక్కుతుంది." ~కె.రామలక్ష్మి ఆరుద్ర     "మామూలు మాటలతో పాటలని పొదగ వచ్చు అనే విషయాన్ని మొట్ట మొదటిగా ప్రదర్శించి చెప్పింది, ఆచరించి చూపింది ఆచార్య ఆత్రేయ" ~కొంగర జగ్గయ్య     "వేమన తరువాత ఆత్రేయ పుట్టాడు. అంత తేట తెలుగుదనం ఉంది ఆయన రచనలో" ~ హీరో కృష్ణంరాజు     "ఆత్రేయగారి డైలాగ్స్ కి ట్యూన్ కడితే పాట,ఆయన పాటని ట్యూన్ లేకుండా చదివితే డైలాగ్" ~సత్యానంద్     "సినీ సంభాషణా శైలిని పరిశీలిస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్లుగా "ఆత్రేయ పూర్వం-ఆత్రేయ తర్వాత" అని ఖచ్చితంగా అనవచ్చు." ~తోటపల్లి మధు.      "బరువైన తేలిక పదాలతో మనసుకు,మనిషికి కొత్త భాష్యాన్ని చెప్పినవారు ఆత్రేయ" ~డా.పర్వతనేని సుబ్బారావు     "తెలుగు సినీ జగత్తుని తన పాటల మాటల వెన్నెల జల్లుతో నిరంతరం పరవశింప జేస్తున్న నెలరేడు ఆత్రేయుడు" ~డా.తలతోటి పృథ్వి రాజ్

Athreya Plays


ఆత్రేయ నాటికలు - నాటకాలు
నాటకరంగానికి సంబంధించిన సంభాషణలో ఎన్.జీ.వో.అనే పేరు విన్నా, గుమస్తా అనే పేరువిన్నా టక్కున అందరి మదిలో మెదిలే పేరు ఆత్రేయ. సినిమా సాహిత్యం తో కాస్త పరిచయం ఉన్నవారికి అతను మంచి పాటల రచయితగా - మన'సు'కవి గా,ఇంకొంచం ఎక్కువ పరిచయం ఉన్నవారికి ఆత్రేయ మంచి పాటల రచయితే కాదు; మంచి సంభాషణల రచయితగా కూడా తెలుసు. సినీ సాహిత్యంతోనే కాదు...;ఆంద్ర సాహిత్యంతోకూడా పరిచయమున్నవారికి ఆత్రేయ మంచి పాటల రచయితగా, మంచి సంభాషణల రచయితగా మాత్రమే కాకుండా అంతకుమించి గొప్ప నాటక రచయితని తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆ నాటకాలే ఆయన్ని నాటక రంగం నుంచి సినిమా రంగానికి నడిపించాయనీ తెలుసు. ఇంతటి గొప్ప నాటక రచయితైన ఆత్రేయ నాటికలు - నాటకాలకు సంబంధించిన ఇతివృత్తాల్నిస్థూలంగా తెలుసుకోండి. ముందుగా ఆత్రేయగారి నాటికలను గూర్చి తెలుసుకుందాము.    

ఆత్రేయ నాటికలు:

     ఉత్త అనుమానం,తహతతై,పిచ్చాసుపత్రి,బెంగాలు కరవు, నిజం ఎవరికెరుక, బలిదానం,అమరత్వానికి ఆహ్వానం మొదలైన నాటికలు నేడు లభించడం లేదు. ప్రస్తుతం లభించేవి
అశ్వఘోషుడు,ఆత్మార్పణ,ఎవరు దొంగ?,ఒక్క రూపాయి,ఓటు నీకే,అంతర్యుద్ధం,అంత్యార్పణ,కళకోసం,కాపలావాని దీపం,ఛస్తే ఏం?,చావకూడదు,తెరచిన కళ్ళు,ప్రగతి,మాయ,వరప్రసాదం  - అనే పదిహేను  నాటికలు మాత్రమే! ఆత్రేయ నాటకాలపై పరిశోధన చేసిన పైడిపాల వాటి స్వభావాన్ని బట్టి ఐదు రకాలుగా విభజించారు.
(అ) ప్రాచ్యానుసరణలు 
(ఆ) పాశ్చాత్యానుసరణలు
(ఇ) సమస్యాత్మక నాటికలు
(ఈ) రాజకీయ నాటికలు
(ఉ) కౌటుంబిక నాటికలు

(అ) ప్రాచ్యానుసరణలు :
భారతీయ పౌరాణిక ,చారిత్రిక గాథలను కాని, రూపకాలనుకాని వాటిలోని పాత్రలను లేదా అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాసిన నాటికలను ప్రాచ్యానుసరణలుగా పేర్కొనవచ్చు.
     
1.అశ్వఘోషుడు: రాహుల్ సాంకృత్యాయన్ రాసిన 'ఓల్గాటు  గంగా' కథల సంపుటిలోని పదకొండవ కథ ' ప్రభ ' ఈ నాటికకు ఆధారం.  ఈ నాటికను ఆత్రేయ ఆకాశవాణి ప్రసారం కోసం రాశారు. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దానికి చెందిన ఆశ్వఘోషుడి చుట్టూ కొన్నిపత్రాలను సృష్టించి కథను అల్లడం జరిగింది. ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలోనే మత,ప్రాతీయ భేదాలు ఉన్నాయని నిరూపించారు. ఈ కారణాల వల్లే   పెద్దలు అడ్డు చెప్పడం వల్ల హిందువైన అశ్వఘోషుడు దత్తామిత్రుడనే గ్రీకు వర్తకుని కూతురు ప్రభని  ప్రేమించి, పెళ్ళాడలేక పోతాడు. ఫలితం ప్రభ సరయూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
     
2 .మాయ: రామాయణంలోని ఋష్య శృంగుని వృత్తంతాన్ని తీసుకొని రాసిన కల్పిత నాటకమిది. మానవ కళ్యాణం కోసం ఉపయోగపడని ఎంతటి ప్రతిభావంతుని ప్రతిభైనా, ఆఖరికి తపస్సు కూడా వ్యర్థమనేది  ఈ నాటికలోని సందేశం.
(ఆ) పాశ్చాత్యానుసరణలు:
   ఆంగ్ల నాటికలను ఆధారం చేసుకొని రాసిన నాటికలు ఈ కోవ కిందకు వస్తాయి. అవి:
  
1 .ప్రగతి: ఈ నాటిక సెయింట్ జాన్ జి.ఇర్విన్ రాసిన 'ప్రోగ్రెస్' నాటికకు అనుసరణ. శాస్త్ర సాంకేతిక విజ్ఞానమనేది మానవ జీవితాన్ని సుఖప్రదం చేసుకోవడానికి ఉపయోగించుకునే విధంగా మలుచుకోవాలే గాని మారణహోమాన్ని సృష్టించే పరిజ్ఞానంగా మార్చకూడదని ప్రభోదించే నాటిక.
  
2. వరప్రసాదం: ఈ నాటిక డబ్ల్యు.డబ్ల్యు .జాకబ్స్ 'మంకీస్ పా'కి అనుసరణ. మంత్ర తంత్రాలతో డబ్బును సంపాయించాలని    అనుకునేవారి దురాశ వల్ల జరిగే అనర్థాలను చూపించి 'శ్రమయేవ జయతే' అనే సత్యాన్ని ఆవిష్కరించే హేతుబద్దమైన ఇతివృత్తం గల నాటిక
  
3. చావకూడదు: జె.బి.ప్రీస్ట్లీ రాసిన 'ఎన్ ఇన్ స్పెక్టర్ కాల్స్ 'ను ఆధారంగా చేసుకొని రాసింది ఈ నాటిక. క్వీన్ మేరీస్ కళాశాల వారి కోరిక మీద మగపాత్రాలు లేకుండా రాసిన నాటకమిది.
(ఇ) సమస్యాత్మక నాటికలు:
      వ్యవస్థలోని చేదు నిజాల్ని చిత్రిస్తూ మేధకు  పదును పెట్టేవి,ప్రశ్నార్థకంగా  నిలిచేవి ఈ నాటికలు.
    
1. ఎవరు దొంగ: ఆకలి బాధతో దొంగతనానికిపాల్పడిన వాడు కాదు దొంగ. అవినీతితో  ఉద్యోగ ధర్మాన్ని మరచిన వారు, చీకటి బజారులో అక్రమ వ్యాపారాన్ని సాగించే వారు అసలైన దొంగలని నిరూపించిన నాటిక ఇది.
    
2. ఒక్క రూపాయి: మనిషి సృష్టించిన డబ్బు మనిషినే ఎలా ఆడిస్తుందో,డబ్బుకి,ప్రాణానికి ఉండే సంబంధం గురించి సామాజికులను ఆలోచింపజేసే సమస్యాత్మక నాటిక ఇది.
(ఈ) రాజకీయ నాటికలు:
     ఎన్నికలు   జరిగే వరకు ఓటర్లకి కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్ల కోసం వారి చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు, ఆ తర్వాత వారి చుట్టూ ఎన్నుకున్న ఆ ఓటర్లు. ఇలాంటి రాజకీయ అంశాలతో కూడినవి రాజకీయ నాటికలు.
   
1.ఓటు నీకే: ఓటుకోసం నాయకులు వేసే వేషాలు,ఎత్తులు ప్రజలు గమనించి సరైన అభ్యర్థిని ఎన్నుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభోదించే నాటిక.
  
2.అంత్యార్పణ: దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు ఏర్పడ్డ కాంగ్రెస్,స్వాతంత్ర్యానంతరం ఆ పార్టీలో గాంధేయ వాదులనే పేరుతో చలామణి అయి అన్యాయాలకీ .అక్రమాలకూ ఎలా పాల్పడుతున్నారో చెప్పే ఇతివృత్తం గల నాటిక ఇది.
(ఉ) కౌటుంబిక నాటికలు:
   కుటుంబ పరమైన విషయాలను, సమస్యలను ఇతివృత్తంగా  స్వీకరించి రాసినవి.
   
1.కళకోసం: నాటక సమాజంలో నీతి,నియమాల ఆవశ్యకతను గూర్చి,ఆత్రేయ తన ఆవేదనను ఇందులో వ్యక్తం చేశారు.
   
2. ఛస్తే ఏం?: ఆ కాలంలో కాంట్రాక్ట్ నాటకాలు జరుగుతుండేవి. ఆ నాటకాలు బాగా ఆడినందు వల్ల నటులుగా వారు సంపాదించేది ఏమీ ఉండదు, కీర్తి తప్ప. ఆ కీర్తి వారి ఆర్థిక దుస్థితిని మెరుగుపరచలేదని, కనీసం కడుపునింప లేదని,నిరాశా నిస్పృహలతో కవిగా తన బాధను వ్యక్తంచేశారీ నాటికలో.
    
3.ఆత్మార్పణం: మనువుకంటే మనసుగొప్పదని నిరూపిస్తూ హిందూ వివాహ చట్ట వైఫల్యాన్ని సూచించే నాటిక ఈ ఆత్మార్పణం.
పైడిపాలగారు"కాపలావాని దీపం"అనే నాటికను ప్రాచ్యను సరణి గానూ,"అంతర్యుద్ధం"అనే నాటికను సమస్యాత్మక నాటికగా గుర్తించారు.'కాపలావాని దీపం'లోని పాత్రలు,ఇతివృత్తం పరిశీలించి చూస్తే ప్రతీకాత్మకంగా ఉన్నాయి. వర్తకుడు,బూర్జువా,కవి,కార్మికుడు,పాత్రలు,ప్రతీకలు.కాబట్టి దీనిని ప్రతీకాత్మకంగా గుర్తించవచ్చు.
     ' అంతర్యుద్ధం' లోని వివేకం,ఆవేశం,అంతరాత్మలు ఇందులోని పాత్రలు. వీటిని ప్రతీకాత్మకంగా ఆత్రేయ సూచించారు. ఇందులో సమస్యకన్న విమర్శ ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి'కాపలావాని దీపం','అంతర్యుద్ధం' ఈ రెండు నాటికలను కూడా ప్రతీకాత్మక నాటికలుగా పేర్కొనవచ్చు.
     తెరచిన కళ్ళు:ఆత్రేయ నాటకాల మీద ఎం.ఫిల్.డిగ్రీకి పరిశోధన చేసిన పైడిపాలగారు స్పృశించని నాటకమిది. మనస్వ్వినీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ నాటికను "ఆత్రేయ సాహితీ"లోని మూడవ సంపుటిలో 12 వ నాటికగా ప్రచురించారు. 'వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం' అన్న సుభాషితానికి నిదర్శనంగా ఈ నాటిక కనిపిస్తుంది.విద్యా, విజ్ఞానం అనేవి బంగారం లాంటివి. మెరుగు పెట్టే కొద్ది ప్రకాశిస్తాయి. స్వార్థంతో దాస్తే ఇతరులకు ఆ విజ్ఞానాన్ని,విద్యనూ పంచకపోతే కళా విహీనంగా మారతాయని చాటే నాటిక ఇది.
ఆత్రేయ నాటకాలు:
పరిషత్తుల్లో తగిన గుర్తింపు రాలేదన్న కోపంతో,నిరాశతో మొట్ట మొదటిగా రాసిన 'శాంతి'నాటక ప్రతిని చిమ్పిపారేసారు ఆత్రేయ. ఆ తరువాత రాసిన "డాక్టర్ కొట్నీస్,సాధన"నాటకాలు ఇప్పుడు లభ్యం కావట్లేదు.అవిపోగా మనకిప్పుడు లభ్య మయ్యేవి పది నాటకాలు. ఈ పది నాటకాలను రెండు సంపుటాలుగా మనస్వ్వినీ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రచురించారు. ఆత్రేయ నాటకాలను స్థూలంగా ఈక్రింది విధంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు.
(అ) చారిత్రిక నాటకాలు.
(ఆ) సాంఘిక నాటకాలు.

గౌతమబుద్ధ,అశోక్ సమ్రాట్,పరివర్తన,వాస్తవం,ఈనాడు,ఎన్.జీ.ఓ,విశ్వ శాంతి,కప్పలు,భయం,మనసూ-వయసు . ఆత్రేయ రాసిన ఈ పది నాటకాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు.గౌతమబుద్ధ,అశోక్ సమ్రాట్ చారిత్రిక నాటకాలు కాగా పతివర్తనం,వాస్తవం,ఈనాడు,ఎన్.జీ.ఓ,విశ్వ శాంతి,కప్పలు,భయం,తిరుపతి(మనసూ-వయసు) నాటకాలను సాంఘిక నాటకాలుగా పేర్కొనవచ్చును.
(అ) చారిత్రిక నాటకాలు:    
   1.గౌతమబుద్ధ:
      జార్జి బెర్నార్డ్ షా రాసిన' ది బ్ల్యాక్ గర్ల్ ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్'(The Black Girl Search of God) అనే కథ ఈ నాటకానికి ప్రేరణ. ఈ నాటక రచనా విధానంలో ఆత్రేయ వినూత్నంగా సాహసంతో కూడిన రెండు ప్రయోగాలు చేశారు. ఆయా సంభాషణల ముందు సంభాషించే పాత్రల పేర్లు పెట్టకుండా దృశ్యాలకు ముందు మాత్రమే పేర్కొనడం ఒకటైతే,నృత్యాలను,పాటలను చేర్చడంతో పాటు గేయల్లా సాగిపోయే సంభాషణలను రచించడం రెండవ ప్రయోగం. ఈ నాటక ప్రధాన ఇతివృత్తం సత్యాన్వేషణ. ఇది ఆత్రేయ నాటకాలలో ప్రదర్శితం కాని ఏకైక నాతకమవడం గమనార్హం.
   2.అశోక్ సమ్రాట్:
      శాంతి ప్రాధాన్యతను ప్రభోదిస్తూ రాసినది ఈ నాటకం.1940 - 1945 మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా 1944 లో ఈ నాటకాన్ని రాయడం జరిగింది.ఇలా ఒక సమకాలీన సార్వజనీన సమస్యను చిత్రించడానికి ఒక చారిత్రిక గాథను ఆధారంగా చేసుకొని రాయడంలో ఆత్రేయ సఫలీకృతులయ్యారు.
(ఆ) సాంఘిక నాటకాలు:   
    1.పరివర్తన:
     ఈ  నాటకానికి ఆధారం న్యూ థియేటర్స్ వారి 'హమ్ రాహ్' హిందీ చిత్రం. హమ్ రాహ్ అంటే 'సహపధికుడు' అని అర్థం.ఈ నాటకం ఆత్రేయను రచయితగా వెలుగులోకి తెచ్చింది. పెట్టుబడిదారులు కార్మిక  వర్గపు శ్రమ శక్తితో పాటు మేధాశక్తిని కూడా ఎలా దోచు కుంటున్నారో - అలాంటి మేధా వర్గానికి చెందిన కవిలో ఎలా పరివర్తన కలిగిందో తెలియ జెప్పడమే ఇందులోని ప్రధానాంశం.
   2.వాస్తవం:
     చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కుహునా రాజకీయ వాదుల్ని విమర్శిస్తూ రాసినది ఈ నాటకం.ఇది కాంగ్రెస్ సంస్థకి మూఢ భక్తితో అంకితమై,పదవులు ఆశించని నిర్మల ప్రజా సేవకుడు వెంకటాద్రి కథ.
  3.ఈనాడు:
     హజ్రాబెగం రాసిన 'ది బాన్ ఫైర్ '(The Bonfire) కథ ఈ నాటక రచనకు ప్రేరణ. హిందూ ముస్లింల సామరస్యం ప్రధాన ధ్యేయంగా సాగిన ప్రబోధాత్మక నాటకం ఇది.
   "1947 ఆగస్ట్ 15 నాదు మనకు వచ్చిన స్వాతంత్ర్యం  రాజకీయ స్వాతంత్ర్యమే అని చాలామందితో పాటు నమ్మిన ఆత్రేయ, ఆర్ధిక,నైతిక,మత స్వాతంత్ర్యాలు ఎలా రాలేదో అద్దం పట్టినట్లు చూపారు మన రచనల్లో. మత సామరస్యం,తద్వారా దేశ సమైక్యత - ఇవి ప్రతి భారతీయుడూ అమలుపరచవలసిన సిద్ధాంతాలని ప్రభోదించే నాటకం ఈనాడు అని ఈనాడు నాటకంపై యస్.కుటుంబరావు తన అభిప్రాయాన్ని చెప్పాడు.
   4.ఎన్.జీ.వో:
      మధ్య తరగతి కుటుంబాల సగటు కథ ఈ ఎన్.జీ.వో. పైడిపాల గారు పేర్కొన్న మాదిరి "ఎన్.జీ.వో."అచ్చమైన ఆధునికాంధ్ర సాంఘిక నాటకానికి తొలి రూపం. ఆధునికాంధ్ర నాటక రంగానికి పునాది రూపకం. తెలుగు నాటక చరిత్రలో ఎన్.జీ.వో.ఆవిర్భావం గొప్ప మలుపు. 'పరివర్తన','ఈనాడు' రాసి ప్రదర్శించిన అనుభవంతో రంగస్థల నాటక స్వరూపాన్ని బాగా అవగాహన చేసుకొని రాసిన నాటకం ఎన్.జీ.వో.
   5.విశ్వశాంతి: 
        యుద్ధం ఒక విచిత్రమైన పుండు వంటిదనీ, యుద్ద బీభత్సంతో కల్లోలమౌతున్న ప్రపంచానికి శాంతి మాత్రమే సక్రమమైన పరిష్కారం కాగలదని సూచించే నాటకం'విశ్వశాంతి'. దీనికి రావల్సినంత ప్రచారం గాని గొప్ప ప్రయోగాత్మక నాటకం. దీనిలోని పాత్రలు వ్యక్తులు కారు, సంకేతాలు. భూదేవి,శాంతి,సమతా మొదలైన వారు పాత్రలు."నాతకరంగామనే వైద్యశాలలో జరుగుతున్న ఒక చికిత్సా విధానమే ఈ "విశ్వశాంతి"అని దీనికి ముందు మాట శ్రీ శ్రీ రాశారు.
   6.కప్పలు:
      ఈ నాటకానికి జె.బి.ప్రీస్ట్లీ 'లేబర్న్ గ్రోవ్' (Laburnum Grove) నాటకానికి సామ్యముంది.తెప్పలుగా చేరువునిండిన కప్పలు పదివేలు జేరుగదరా సుమతీ" అన్న సుమతీ శతకంలోని పద్యపాదం ఈ నాటకానికి ఆధారం."రాజకీయ నినాదాలతో నాటకాన్ని రక్తి కట్టించు కుంటాడన్న వాడును కాదనిపించుకోవాలని ఈ నాటకం వ్రాశాను"అన్నారు ఆత్రేయ.
   7.భయం:
      మనిషికి మనిషన్న భయం. చావంటే భయం.చచ్చే వరకు జీవితమే భయం భయం. ఈ భయమే ఇందులోని ప్రధానాంశం.భయం రక రకాల మనుషుల మనస్సులో కలిగించే మార్పు'భయం'నాటకంలో కరుణ రసాత్మకంగా చూపించారు.
   8.తిరుపతి(మనసూ - వయసూ):
       ఈ నాటకానికి సిడ్నీ హావర్డ్  "దే న్యూ వాట్ దే వాంటెడ్" (They knew what they wanted) అనే నాటకం మూలం. సినిమా తరహాలో  సాగినదీ నాటకం.మనసులతో ప్రేమించుకున్నవారి మనసులకు - వారి వయసుకు మధ్య జరిగిన ఘర్షణ ఈ నాటకం.
      ఆత్రేయ  గారి నాటికలు,నాటకాలు కొన్ని అనువాదాలైనప్పటికీ అనువాదాలుగా అనిపించవు. ఎందుచేతనంటే పాత్రల పేర్లు,ఆ నాటకంలోని సన్నివేశాలు,తెలుగు కట్టూ-బొట్టు అన్నీ తెలుగు నాటకాల్లోనివిలా ఉంటాయి.