"ఆత్రేయ పాటల్లో లోతైన భావాలు,జీవిత సత్యాలు,ఎంతో మేధస్సు ఇమిడి వున్నాయి. ప్రజల ఆలోచనలు,ఊహాగానాలు ఆయన పాటల్లో వుట్టిపడుతుంటాయి. మనిషి జీవిత అనుభవాలు,చీకటి,వెలుతురు,అపజయాల గురించి ఆయన హృదయాలకు హత్తుకునే విధంగా పాటలు రాశారు" ~ కీ.శే.ఎన్.టి.రామారావు     "మానవ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, గెలుపు ఓటములను అనుభవాలను ప్రతిబింబిస్తూ మనసుల్ని కదిలించే విధంగా ఆయన రాసిన పెక్కు పాటలు చిరస్మరణీయాలై నిలిచాయి" ~ ఎన్.టి.రామారావు     "ఆత్రేయ వ్రాసిన పాటలన్నీ ప్రజల మనోభావాలను పుణికిపుచ్చుకుని ఉండేవి" ~ఎన్.టి.రామారావు     "ఆత్రేయ అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగ కర్త, ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట,పాటల ముత్యాలపేట" ~ డా.సి.నా.రె.     "బరువైన భావాల కొండలను చిటికెను వేలుపై గోవర్ధన గిరివలె సునాయాసంగా తేలిక మాటల్లో వహించడం,వచించడం గీతాచార్యుడికే(ఆత్రేయ)తెలుసు" ~వేటూరి సుందరరామ మూర్తి     "భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను తిమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడం ఆచార్యుడు(ఆత్రేయ)తిక్కనకు వారసుడు" ~వేటూరి సుందరరామ మూర్తి     "సినీ సాహితీ రంగంలో అపర శ్రీనాథుడు. తెలుగు సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించినవాడు" ~గొల్లపూడి మారుతీరావు     "శృంగారమైనా,మమకారమైనా తేలిక పదాలతో చదువుకున్న వాణ్ణి ,చదువులేని వాణ్ని గుండె లోతులవరకూ కదిలించగల ప్రతిభ ఆత్రేయది" ~ గొల్లపూడి మారుతీరావు     " తెలుగు సినిమాకు ఒక గొప్ప రూపాన్ని కల్పించిన రచయిత. తనదైన బాణీని ఇచ్చిన రచయిత ఆత్రేయగారు" ~గొల్లపూడి మారుతీరావు     "ఆత్రేయ వ్రాసిన పాటల్లో ప్రతి పల్లవి తీసుకొని ఒక కథ వ్రాయవచ్చు. అంత గంభీరమైన,భావస్పోరకమైన భాష ఆత్రేయది" ~కె.ఎస్.ప్రకాశరావు     " తెలుగు భాష తెలిసిన నటీనటులకు ఆత్రేయ సంభాషణలు పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన విస్తరి." ~ గుమ్మడి వెంకటేశ్వరరావు      "శ్రీ ఆత్రేయ వ్యక్తిగా చాలా నిరాడంబరుడు. ఆయన విలువ ఆయనకే తెలియని ఒక సామాన్యుడు. కత్తితో కోస్తే రక్తం వస్తే, ఆయన కలంతో రాస్తే రక్తం ఉడుకెక్కుతుంది. మనసు ఉరకలేస్తుంది.రాసినవాడికి కాదు, ఆయన రాసింది చదువుకునే వాడికి! ~ శ్రీ కె.విశ్వనాథ్     " శ్రీ ఆత్రేయ గారు స్వయంగా నటుడు, ప్రయోక్త,రచయిత కాబట్టి ప్రతి డైలాగు రాసిన తర్వాత నటుడిగా నటించుకొని, ప్రయోక్తగా ఎంతవరకూ కావాలో కుదించుకొని, అక్షరలక్షలుగా వ్రాయటం, ఆయనలోని ప్రత్యేకత." ~ మురళీమోహన్     " ఎక్కడ ఇపోతాయో...అన్నంత పొదుపుగా తన సంభాషణా రచనలో మాటల్ని వాడుకున్నవాడు ఆత్రేయ" ~తనికెళ్ళ భరణి     "తెలుగు సినిమా పాటకో మనసుని, ఉన్నతమైన భావాన్ని ఇచ్చిన ఘనత ఆత్రేయకు దక్కుతుంది." ~కె.రామలక్ష్మి ఆరుద్ర     "మామూలు మాటలతో పాటలని పొదగ వచ్చు అనే విషయాన్ని మొట్ట మొదటిగా ప్రదర్శించి చెప్పింది, ఆచరించి చూపింది ఆచార్య ఆత్రేయ" ~కొంగర జగ్గయ్య     "వేమన తరువాత ఆత్రేయ పుట్టాడు. అంత తేట తెలుగుదనం ఉంది ఆయన రచనలో" ~ హీరో కృష్ణంరాజు     "ఆత్రేయగారి డైలాగ్స్ కి ట్యూన్ కడితే పాట,ఆయన పాటని ట్యూన్ లేకుండా చదివితే డైలాగ్" ~సత్యానంద్     "సినీ సంభాషణా శైలిని పరిశీలిస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్లుగా "ఆత్రేయ పూర్వం-ఆత్రేయ తర్వాత" అని ఖచ్చితంగా అనవచ్చు." ~తోటపల్లి మధు.      "బరువైన తేలిక పదాలతో మనసుకు,మనిషికి కొత్త భాష్యాన్ని చెప్పినవారు ఆత్రేయ" ~డా.పర్వతనేని సుబ్బారావు     "తెలుగు సినీ జగత్తుని తన పాటల మాటల వెన్నెల జల్లుతో నిరంతరం పరవశింప జేస్తున్న నెలరేడు ఆత్రేయుడు" ~డా.తలతోటి పృథ్వి రాజ్

Friday, January 14, 2011

ACHARYA ATHREYA PHILOSOPHICAL DIALOUGES FROM VELUGUNEEDALU -01
 ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతివ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ ఓ సన్నివేశానికి ఆత్రేయ రచించాడు. ఈ సినిమాలో కథానాయకుడు చంద్రానికి టి.బి.వ్యాధి  సోకుతుంది. డాక్టర్లు చంద్రాన్ని పరిశీలించి అతని భార్యకి కొన్ని జాగ్రత్తలు  చెప్పి వెళ్ళిపోయాక "డాక్టర్లు ఏమన్నారు?" అని చంద్రం భార్యను అడిగిన సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.
                ప్రాణాలు మింగేటు వంటి టి.బి.వ్యాధి అతనికి ఉందని తెలిసినా చంద్రం నిబ్బరంగా ఉంటాడు. కారణం అతని తత్వం ; వేదాంత ధోరణి,జీవిత రహస్యం తెలిసిన వాడుగనుకనే "ఎందరో మహానుభావులు, మహాత్ములు...." అనే వాక్యాన్ని ఆ పాత్ర ద్వార ఆత్రేయ పలికిస్తాడు. అలాగే విషాదంలో వేదాంత ధోరణినే కాక జీవిత రహస్యాన్ని కూడా ఆత్రేయ ఈ సంభాషణలో తెలిపారు. " మనిషి చాలాకాలం బ్రతుకుతాడన్నా అబద్దం కంటే..."అనే వాక్యంలో జీవిత పరమార్థాన్ని పాత్రద్వారా ఆత్రేయ పలికిస్తాడు.

Wednesday, January 12, 2011

ACHARYA ATHREYA SENTIMENT DIALOUGES FROM ANTULENI KATHA TELUGU MOVIE
సెంటిమెంటల్ (sentimental) అనే పదానికి భావగర్భితమైన, కరుణాదిరసముగల,శృంగార భావములుగల అర్థాలున్నాయి బ్రౌన్ నిఘంటువులో. సినిమా  పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను,ఆత్మీయానుబంధాలతో,కరుణరస భరితంగా  ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంట్ డైలాగ్స్ రాయించుకోవాలనే శ్రీ కె.ఎస్. ప్రకాశరావు ఆత్రేయగారిని తన "దీక్ష" చిత్రానికి పాటల రచయితగానే కాకుండా, మాటల రచయితగా కూడా  ఎన్నుకొని తెలుగు చిత్రసీమకు ఆత్రేయను పాటల మాటల రచయితగా పరిచయం చేశారు. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగారాస్తాడని ఆత్రేయ గారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆత్రేయను శ్రీశ్రీ ఎప్పుడు ఎగతాళి చేస్తూ అంటూ ఉండేవాడని తన ఇంటర్వ్యూ లో శ్రీ బొల్లిముంత శివరామ కృష్ణ చెప్పారు.
బాధ్యతలు పంచుకోవాల్సిన పెద్దలే జీవితానికి భయపడి దేశాటన చేస్తూ తిరిగితే... ఒక ఆడపిల్ల గంపెడు కుటుంబాన్ని ఎలా పోషించగలదు? అన్ని ఆశలు చంపుకొని శవంలా ఎలా ఉండగలదు? అలాంటి వ్యధే "అంతులేని కథ"లో సరిత పాత్ర స్థితి. కొన్ని ఏళ్ళ క్రితం భార్యా బిడ్డలను,సంసార బాధ్యతల్ని విడిచి వెళ్ళిన తన తండ్రి వస్తున్నాడని సరిత సంతోషిస్తుంది. కుటుంబ బాధ్యతలన్నీ తండ్రికి అప్పజెప్పి అందరి ఆడపిల్లల్లా పెళ్లి చేసుకోవాలని సరిత కలలు కంటుంది. కాని సన్యాసిగా తిరిగివచ్చి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండే తండ్రిని సరిత తరిమేస్తుంది. కూతురి మూగావేదనను కన్న తల్లికూడా అర్ధం చేసుకోలేని దురదృష్టం సరితది. ఒక భార్యగా 'రాక రాక వచ్చిన భర్తకు కూడు కూడా పెట్టకుండా తరిమిందని ఆలోచించిందే గాని తన పేగు తెంచుకొని పుట్టి పెరిగిన బిడ్డ భవిష్యత్తు గూర్చి ఆలోచించని సరిత తల్లికి - సరితకు మద్య జరిగిన సంభాషణ సన్నివేశాన్ని ఆత్రేయ అద్భుతంగా రచించారు.

ACHARYA ATHREYA PHILOSOPHICAL DIALOUGES FROM PREM NAGAR-1
ఆంగ్లంలో వేదాంతాన్ని Philosophy అంటారు. గ్రీకులో దీనికి అర్థం 'Love of wisdom' అని అర్థం. అంతే కాదు study of the ultimate reality,causes and principles underlying being and thinking అనే అర్థాలున్నాయి. 
ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ ఒకచోట అంటారు. ఇటువంటి వేదాంత సంభాషణలను అవసరమైన సన్నివేశాలలో పాత్రలచేత చక్కగా పలికించారు ఆత్రేయ."ప్రేమనగర్" చిత్రంలో తమ ఎస్టేట్ భూములను తన పి.ఎ.గా చేరిన లలితకు పరిచయం చేస్తూ హీరో కళ్యాణ్ మాట్లాడాల్సిన ఆ సన్నివేశానికి చాలా సహజంగా తాత్వికంగా ఆత్రేయ సంభాషణలను సమకూర్చాడు. ఈ సన్నివేశంలో వేదాంతాన్నే కాదు, ధ్వనిని,వ్యంగ్యాన్ని ఉపయోగించి సంభాషణా అభివ్యక్తిని శక్తివంతంగా సాధించగలిగారు మన'సు'కవి ఆచార్య ఆత్రేయ. 


ACHARYA ATHREYA AS A ACTOR IN BHAMAKALAPAM TELUGU MOVIEఆచార్య ఆత్రేయ చివరిదశలో హాస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన "భామాకలాపం" సినిమాలో అతిధి పాత్రలో నటించారు. ఆత్రేయ గారు సహాయ నటుడిగా ప్రధాన భూమికగా "కోడెనాగు" చిత్రంలో నటించారు. ఆత్రేయ గారు "ఆదర్శం" చిత్రంలోకూడా నటించారు. భామాకలాపం"లో ఆత్రేయకు హాస్య సంభాషణలు సమకూర్చింది తానేనని శ్రీ దివాకరబాబు నేనుచేసిన ఇంటర్యూలో అంటాడు. హాస్యంకోసం ఉద్దేశించి పెట్టిన సన్నివేశమే అయినా ఇందులో ఎన్నో విషయాలకు          ఆత్రేయగారు సమాధానం చెబుతారు. "రాసి ప్రేక్షకులను రాయక నిర్మాతల్ని" ఆత్రేయ ఏడిపిస్తాడు అనే అపవాదానికి సమాధానమన్నట్లు సంభాషణ ఉంటుంది. ఆత్రేయను హాస్పటల్ కు తీసుకువచ్చిన సహాయకుని పాత్రలో నటించింది అప్పటి ఆత్రేయ అసిస్టెంట్ ,నేటి సినీ రచయిత, ఆత్రేయ సాహితీ పురస్కార గ్రహీత శ్రీ గురుచరణ్. ఇలా ఆత్రేయ మూడు సినిమాలలో నటించాడుగాని స్వయంగా తాను నిర్మించిన వాగ్దానం చిత్రంలో నటించే అవకాశం ఉన్నా నటించలేదు. అంత శ్రద్ధవహించి చిత్రాన్ని నిర్మించినా సినిమా ఆడక ఆత్రేయ నష్టపోయారు. మరెప్పుడు సినిమా తీయనని ఆత్రేయ "వాగ్దానం"చేసినట్లు అందరూ అంటుంటారు.  

ATHREYA DIALOGUES FROM MANUSHULU MAMATHALU-01     
    శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అనికూడా పేరు మూట గట్టుకునేలా చేసింది. " నా సినిమా సాహిత్యాన్ని గురించి మరికొన్ని నిజాలు చెప్పాలి. నేను రాసినవన్నీ మంచివి కావు. కొన్ని చెత్త పాటలూ రాశాను. కొన్ని బూతులు ధ్వనించేలా రాశాను. సినిమా కవి బ్రతుకు అనేకానేక అభిరుచులుగల విటులను సంతృప్తి పరచవలసిన పడుపు వృత్తి" అని ఒకచోట బాధపడుతూ అంటాడు ఆత్రేయ. "మనుషులూ-మమతలు" అనే చిత్రంలో ఒక సెంటిమెంట్ సన్నివేశానికి సంభాషణ అశ్లీలంగా హేతుబద్దంగా రాయాల్సివచ్చినప్పుడు ఆత్రేయ ఎంత గొప్పగా రాసాడో మనం గుర్తించవచ్చు.
    రాధ భర్త భాస్కర్. తండ్రిపై బెంగపెట్టుకున్నబిడ్డకోసం అత్త సూచన మేరకు వాణి అనే వేశ్య వలలో పడిపోయి,తాగుడుమత్తులో మునిగి పోతున్న భర్తకోసం రాధ నేరుగా తన భర్త ఉన్న వేశ్య ఇంటికి వెళుతుంది. ఒక సంసారికి, వేశ్యకు మధ్య జరిగిన సంభాషణను ఆత్రేయ ఎంతో సెంటిమెంట్ గా, హేతుబద్దంగా రచించారు.